ఢిల్లీలో జరిగిన 23వ భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల సంబంధాలకు మరోసారి నూతన ఊపిరి పోశింది
భారత్–రష్యా దౌత్య బంధానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఆ బంధాన్ని మరింత బలపరిచే వేదికగా నిలిచింది 23వ ఇండియా–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ–రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఈ సమావేశంలో రెండు దేశాల సహకారంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆర్థిక రంగం నుంచి శక్తి భద్రత వరకు… విద్య నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు… సముద్ర రవాణా నుంచి క్రిటికల్ మినరల్స్ వరకు.. అన్ని అంశాలపై నేతలు లోతుగా మాట్లాడుకున్నారు. 2030 వరకు అమల్లో ఉండే ఆర్థిక సహకార కార్యక్రమాన్ని రెండు దేశాలు ఆమోదించడం ఈ సమావేశానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత్–రష్యా వ్యాపార, పెట్టుబడి సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందాలు దిశానిర్దేశం చేయనున్నాయి. “2030 వరకు అమలు చేయబోయే ఆర్థిక సహకార కార్యక్రమంపై అంగీకారం కుదిరింది. రెండు దేశాల వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు విస్తరించాలని కోరుకుంటున్నాం. నౌకా నిర్మాణం నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు అనేక రంగాల్లో కలిసి ముందుకు సాగుతాం” అని మోదీ ట్వీట్ చేశారు.
భారత్–రష్యా స్నేహానికి ఆయువుపట్టుగా నిలిచేవి ప్రజల మధ్య సంబంధాలే. ఇటీవల రష్యాలో రెండు కొత్త భారత కాన్సులేట్లు ప్రారంభం కావడం, పవిత్ర బౌద్ధ అవశేషాలు రష్యాకు తీసుకెళ్లడం.. రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధానికి కొత్త ఊపు తీసుకొచ్చాయి. విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో సహకారం పెంచుకునే అవకశం ఎంతో ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు.
ప్రముఖ గ్లోబల్ ఇష్యూలు కూడా చర్చల్లో ప్రధాన స్థానమే దక్కించుకున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై శాంతియుత, దీర్ఘకాలిక పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని మోదీ మళ్లీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కలిసి పనిచేయాలని, అనేక బహుళపక్ష వేదికల్లో పరస్పర సహకారం కొనసాగించాలనే దానిపై కూడా రెండు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. “ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్–రష్యాలు కలిసి పనిచేయాలి. ఈ ప్రమాదానికి ఎవ్వరూ ఒంటరిగా ఎదుర్కోలేరు” అని మోదీ పేర్కొన్నారు.
మొత్తం మీద… పుతిన్–మోదీ భేటీ భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ రాజకీయ పరిణామాల మధ్య కూడా మాస్కో–దిల్లీ బంధం అచంచలమని మరోసారి ప్రపంచానికి సందేశం ఇచ్చిన సమావేశంగా ఈ శిఖరాగ్ర భేటీ నిలిచింది.